సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా నటించి.. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన డీజే టిల్లు భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. యువతరం ప్రేక్షకుల నుండి డీజే టిల్లు సినిమాకు మంచి ఆధరణ లభించింది. సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ డీజే టిల్లు జోరు ఇప్పట్లో ఆగదని, త్వరలోనే సీక్వెల్ చేయబోతున్నట్లుగా హీరో సిద్దు జొన్నలగడ్డ అప్పుడే అధికారికంగా ప్రకటించారు.
సీక్వెల్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో స్వయంగా హీరో సిద్ధు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక డీజే టిల్లు మొదటి భాగానికి దర్శకత్వం వహించిన దర్శకుడు విమల్ కృష్ణ సీక్వెల్ కు పని చేసే అవకాశం లేకపోవడంతో మరో దర్శకుడిని వెదికే పనిలో పడ్డారట డీజే టిల్లు చిత్ర యూనిట్.
ఇక భారీ అంచనాలు ఏర్పడ్డ ఈ సీక్వెల్ ను తెరకెక్కించే సరైన దర్శకుడి కోసం చిత్ర యూనిట్ చాలా మందినే చూశారు. చివరికి అద్భుతం అనే సినిమాకు పని చేసిన దర్శకుడు మల్లిక్ ను డీజే టిల్లు 2 యూనిట్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తేజా సజ్జా మరియు శివాని జంటగా అద్భుతం అనే సినిమాని దర్శకుడు మల్లిక్ తెరకెక్కించిన విషయం తెలిసిందే.
ఆ సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి స్పందన లభించింది. ఓటీటీ లోనే నేరుగా విడుదలైన ఆ సినిమాను ప్రేక్షకులు చక్కగా ఆదరించారు. ఇక విమర్శకులు కూడా ఆ సినిమా ను చూసి మంచి ప్రయత్నంగా మెచ్చుకున్నారు. టైమ్ ట్రావెల్ వంటి క్లిష్టమైన కాన్సెప్ట్ ను ఎంచుకుని దాన్ని ఎంతో సమర్థవంతంగా తీసిన మల్లిక్ ఇప్పుడు డీజే టిల్లు సినిమాను ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.
ఇక డీజే టిల్లు 2 లో హీరోయిన్ పాత్ర విషయమై రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నేహా శెట్టి ఈ సినిమాలో ఉండరని ఒకసారి, లేదు ఉంటుంది కానీ ఆమెతో పాటు మరో హీరోయిన్ కూడా డీజే టిల్లులో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి నిజానిజాలు ఏమిటో చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తే తప్ప తెలియదు.