ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ‘ది వారియర్’.. భారీ అంచనాల మధ్య పోయిన వారం విడుదల అయింది. ఈ సినిమాను తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తుండటంతో మంచి మాస్ ఎంటర్టైనర్ గా రూపొందబడిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుంది అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఇక ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య జూలై 14న రిలీజ్ చేశారు.
పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో రామ్ డాక్టర్ గా మరియు పోలీస్ గా రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచారు. అదీ కాక కెరీర్‌లో తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన రామ్, తన నటనతో ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యారు అని చెప్పవచ్చు. అయితే సినిమాలో కథ, తీరుతెన్నులు మాత్రం మూస ధోరణిలో ఉండటం వల్ల ఈ సినిమాకు రిలీజ్ రోజున టాక్ పరంగా మిశ్రమ స్పందన లభించింది. కానీ తొలిరోజున కలెక్షన్లు మాత్రం పరవాలేదనే స్థాయిలో వచ్చాయి.
అయితే కలెక్షన్లు తరువాత పుంజుకుంటాయి అని ట్రేడ్ వర్గాలు ఆశించాయి. అయితే ఆ ఆశలు నిజం కాలేదు. వారాంతంలో కూడా ఈ సినిమా కలెక్షన్లలో జంప్ కనపడలేదు. ఈ సినిమాని చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తిని చూపకపోవటం గమనార్హం. ఆ రకంగా ది వారియర్ సినిమా 4 రోజులు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 16 కోట్ల షేర్ వసూలు చేయగలిగింది. సినిమాకి జరిగిన బిజినెస్ కు మరో 30 కోట్లు రావాల్సి ఉంది. కానీ అంత కలెక్షన్లు వచ్చే సూచనలు కనపడట్లేదు.
కాగా ఈ సినిమా ఫలితం మీద ఉన్న నమ్మకంతో హీరో రామ్ చిత్ర వ్యాపారంలో కూడా భాగం తీసుకున్నారు. నైజాం మరియు వైజాగ్ ఏరియాల హక్కులను ఆయనే ఉంచుకున్నారు. ఆ రెండు ఏరియాల బిజినెస్ కలిపి 15 కోట్ల వరకూ (valued) అయింది. అయితే కలెక్షన్లు మాత్రం 6 కోట్ల వరకు మాత్రమే వచ్చాయి. ఇక ఇవే క్లోజింగ్ కలెక్షన్లు గా పరిగణించవచ్చు. ఆ రకంగా చూసుకుంటే హీరో రామ్ కు దాదాపు 10 కోట్ల నష్టం వాటిల్లింది.