‘రాధే శ్యామ్’ తర్వాత ప్రభాస్ అభిమానులు పెద్దగా ఆనందంగా లేరు. కాగా ఈ చిత్రానికి ప్రభాస్ చాలా ప్రతికూల ప్రతిస్పందనలను అందుకున్నారు. అందుకే ఇప్పుడు ప్రభాస్ తదుపరి చిత్రంతో బలమైన పునరాగమనాన్ని ఇవ్వాలనుకుంటున్నారు.
ఆయన తదుపరి చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయింది. కాగా చిత్ర బృందం ఇటీవలే ఈ సినిమాకి సంభందించిన టీజర్‌ను విడుదల చేసారు. కాగా ఈ సినిమాను జనవరి 12, 2023న థియేటర్లలోకి విడుదల చేయనున్నట్లు కూడా ధృవీకరించారు. ఇక అంతా బాగుంది సినిమా విడుదల కావడమే తరువాయి అనిపించింది, కానీ ఇప్పుడు ఆదిపురుష్ విడుదలపై పరిశ్రమ వర్గాల్లో సందేహం తలెత్తుతోంది.
ఎందుకంటే ప్రస్తుతం ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో గట్టి పోటీ ఉండబోతుంది. ఒక పక్క చిరంజీవి యొక్క మెగా154 మరియు బాలకృష్ణ యొక్క NBK107 సినిమాలు సంక్రాంతికి విడుదలవుతున్నాయి. అంతే కాదు విజయ్ వారసుడు కూడా విడుదలవుతోంది.
తమిళనాడులో ఇప్పటికే టాప్ 2 స్టార్స్ విజయ్, అజిత్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ పరిస్థితి చూస్తుంటే ఆదిపురుష్ సినిమా బడ్జెట్, జానర్ ని పరిగణలోకి తీసుకుని సోలో రిలీజ్ కోసం మరో తేదీకి వాయిదా వేసి విడుదల చేస్తే బాగుంటుందని ట్రేడ్, ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. సంక్రాంతికి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు కూడా ఆదిపురుష్ లాంటి సినిమాకి ఇది సరైన విడుదల తేదీ కాదని చాలామంది అభిప్రాయపడ్డారు. సంక్రాంతికి కాకుండా ఈ సినిమాను సమ్మర్లో రిలీజ్ చేస్తే బాగుంటుందని కొందరు అన్నారు.
అయితే సంక్రాంతికి విడుదల చేస్తామని ముందుగా ప్రకటించినందున తమ సినిమాని వాయిదా వేయమని చెబితే అది ఆదిపురుష్ చిత్ర బృందానికి చాలా కఠినంగా ఉంటుంది. కానీ ఒకవేళ పోటీ ఉన్నా సరే విడుదల చేయాలని ముందుకు వెళితే మాత్రం ఆది పురుష్ తీవ్రమైన పోటీనే ఎదుర్కుంటుంది.
పండగ సీజన్లు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి, ముఖ్యంగా సంక్రాంతి సీజన్ ఐతే వరదలా వచ్చే సినిమాలతో నిండిపోతుంది. ఈసారి సంక్రాంతి పోటీ చాలా ఆసక్తికరంగా సాగుతోంది, ముందు ముందు సినిమాల విడుదల తేదీలలో ఏమైనా మార్పులు జరుగుతాయో లేదో వేచి చూడాలి.
కాగా ‘ఆదిపురుష్’ సినిమాలో రాముడిగా ప్రభాస్ కనిపిస్తే.. సీతగా కృతి సనన్.. రావణుడికి సైఫ్ అలీ ఖాన్ మరియు లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కీలక పాత్రల్లో నటించారు. IMAX మరియు 3D ఫార్మాట్లలో హిందీ తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషల్లో విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు.