ఈ మధ్యకాలంలో థియేటర్లలో విడుదలయ్యే సినిమాల కన్నా.. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లలో విడుదలయ్యే సినిమాల కోసం ప్రేక్షకులలో ఒక వర్గం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వారు ఓటీటీలకు బాగా దగ్గరయ్యాయి. కొందరు వేలల్లో డబ్బులు వెచ్చించి థియేటర్లలో సినిమాలు చూసే బదులు కుటుంబంతో కలిసి అదే చిత్రాన్ని ఓటీటీలో చూసేందుకు ఇష్టపడుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రతీ వారం రకరకాల కాన్సెప్ట్ లతో రూపొందిన చిత్రాలు ఓటీటీ ప్రపంచంలో సందడి చేసేందుకు సిద్దమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ వారం ఓ రోజు వ్యవధిలో ఒకేసారి రెండు విభిన్న చిత్రాలు ఓటీటీలోకి రానున్నాయి.
దసరా కానుకగా విడుదలైన నాగార్జున యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ది ఘోస్ట్’. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకుడు. సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. నవంబర్ 2వ తేదీ నుంచి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
ఘోస్ట్ అనేది యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్, ఈ చిత్రంలో ప్రపంచ అండర్‌వరల్డ్‌ను షేక్ చేసే ఒక ఇంటర్‌పోల్ అధికారి విక్రమ్ పాత్రలో నాగార్జున నటించారు. అయితే కొన్ని కారణాల వల్ల తన ఉద్యోగం నుంచి తొలగించబడ్డ విక్రమ్, తనకు ఎంతో ఇష్టమైన కుటుంబం కోసం దశాబ్దాల తరువాత మళ్ళీ రంగంలోకి దిగాల్సి వస్తుంది. ఆ క్రమంలో మళ్లీ అదే అండర్ వరల్డ్ గ్యాంగ్‌లతో పోరాడాలని నిర్ణయించుకున్న విక్రమ్, ఆ యుద్ధాన్ని ఎలా ఎదుర్కొంటాడు మరియు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు అనేది మిగిలిన కథ.
రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అస్త్రావెర్స్ నేపధ్యంలో ఫాంటసీ అడ్వెంచర్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, షారుఖ్ ఖాన్, మౌనీ రాయ్ కీలక పాత్రలలో కనిపించారు.
‘బ్రహ్మాస్త్ర’ పార్ట్ 1 శివ సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయాన్ని అందుకోవడమే కాకుండా బాక్సాఫీసు వద్ద రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. హిందీతో పాటు రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ చక్కని స్పందన తెచ్చుకుంది.
ఇప్పటి దాకా థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో నవంబర్ 4వ తేదీ నుంచి ‘బ్రహ్మాస్త్ర’ స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది.
ఇక ఒక్క రోజు వ్యవధిలో రాబోయే ఈ రెండు చిత్రాలు.. ప్రేక్షకులను ఏ మేరకు ఓటీటీలో అలరిస్తాయో వేచి చూడాలి.